
Play all audios:
హైదరాబాద్: గద్దర్ సినీ పురస్కారాల్లో (Gaddar Film Awards) భాగంగా తనకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు ప్రకటించడంపై నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా
తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఎంతో ప్రత్యేకమైన ఈ సమయంలో ఇలాంటి పురస్కారానికి తాను ఎంపిక కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
పూర్తి చేసుకున్న అద్భుతమైన ఘడియలు ఒకవైపు.. ఎన్టీఆర్ నట ప్రస్థానానికి 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతోన్న శుభ ఘడియలు మరోవైపు.. నటుడిగా నేను 50ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ
సందర్భం ఇంకొక వైపు.. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్‌తో సత్కరించిన ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘ఎన్టీఆర్ జాతీయ అవార్డు’ ప్రకటించడం నా అదృష్టం. దీనిని దైవ నిర్ణయంగా, నా
తండ్రి ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు. ప్రపంచం నలుమూలలా
ఉన్న తెలుగు ప్రజల దీవెనలు, భగవంతుడి ఆశీస్సులు నాకు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా’’ అని బాలయ్య తెలిపారు. * 2014- 2023 సినిమాలకు గద్దర్ అవార్డులు.. ఉత్తమ చిత్రాలివే! మరోవైపు,
కాంతారావు ఫిల్మ్ అవార్డుకు ఎంపిక కావడంపై విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) స్పందించారు. ‘‘నట ప్రపూర్ణ కాంతారావు ఫిల్మ్ అవార్డుకు ఎంపిక కావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఈ అవార్డుకు ఎంపిక
అయినందుకు సంతోషిస్తున్నా. నాపై నమ్మకం ఉంచి.. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. 2016వ సంవత్సరానికి సంబంధించి రెండో ఉత్తమ చిత్రంగా ‘పెళ్ళి
చూపులు’ ఎంపికైనందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. ఈ విజయం నా అభిమానులకే చెందుతుంది. వారి ప్రేమాభిమానాలే నన్ను నిరంతరం నడిపిస్తున్నాయి. ఈ
ప్రయాణంలో భాగమైన కుటుంబసభ్యులు, దర్శకులు, ఇతర టీమ్ అందరికీ నా ధన్యవాదాలు’’ అని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే, 2015వ సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా ‘రుద్రమదేవి’, 2018వ సంవత్సరానికి ఉత్తమ
చిత్రంగా ‘మహానటి’ ఎంపిక కావడంపై ఆయా చిత్ర నిర్మాణ సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. తమ చిత్రాలను ప్రోత్సహించిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు చెప్పాయి. తెలుగు సినీ
రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ సినీ పురస్కారాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం 2024వ సంవత్సరానికి సంబంధించిన అవార్డుల జాబితాను
ప్రకటించారు. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు సంబంధించిన పురస్కారాల జాబితాను శుక్రవారం వెల్లడించారు. వీటితోపాటు సినీ రంగానికి సేవలు అందిస్తోన్న వారికి ఆరు ప్రత్యేక అవార్డులు
ఇస్తున్నట్లు తెలిపారు.