
Play all audios:
Bhairavam movie review || చిత్రం: భైరవం; నటీనటులు: బెల్లకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్, అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై, శరత్ లోహితాశ్వ, జయసుధ, అజయ్ తదితరులు; సంగీతం:
శ్రీచరణ్ పాకాల; ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్; సినిమాటోగ్రఫీ: హరి కె. వేదాంతం; నిర్మాత: కె.కె.రాధామోహన్; రచన: ఆర్‌ఎస్ దురై సెంథిల్‌కుమార్; దర్శకత్వం: విజయ్ కనకమేడల; విడుదల: 30-05-2025
ఇటీవల కాలంలో బాక్సాఫీస్ ముందుకు వచ్చిన చెప్పుకోదగ్గ చిత్రం ‘భైరవం’ (Bhairavam movie). ముగ్గురు కథానాయకులు కలిసి నటించడం ఈ సినిమా ప్రత్యేకత. ప్రచార కార్యక్రమాలు కూడా అందుకు
తగ్గట్టుగా సందడిగా సాగాయి. మరి సినిమా ఎలా ఉంది? (Bhairavam Review Telugu) ఎలాంటి వినోదాన్ని పంచింది? కథేంటంటే.. వారాహి అమ్మవారి ఆలయానికి రూ.వెయ్యి కోట్లు విలువ చేసే భూములు ఉంటాయి.
వాటిపై మంత్రి (శరత్ లోహితాశ్వ) కన్ను పడుతుంది. అందుకోసం తన బావమరిది నాగరాజు అలియాస్ థియేటర్ (అజయ్)ని రంగంలోకి దింపుతాడు. అయితే ఆలయ భూములకు, నగలకూ గజపతి వర్మ (మంచు
మనోజ్), వరద (నారా రోహిత్) రక్షణ కవచంలా ఉంటారు. ఆ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకరి కోసం మరొకరు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. తరాలుగా వాళ్ల కుటుంబాల మధ్య అదే స్నేహబంధం ఉంటుంది. ఆ
ఇద్దరికీ పరమ విధేయుడు శ్రీను (బెల్లంకొండ సాయిశ్రీనివాస్). మంత్రి తన స్వార్థం కోసం ప్రాణ స్నేహితులైన గజపతి, వరద మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. మరి అతని ప్రయత్నం
ఫలించిందా? (Bhairavam Review Telugu) గుడి భూముల్ని కాజేశాడా? స్నేహితులు విడిపోయారా? వాళ్లిద్దరికీ విధేయుడైన శ్రీను ఎవరివైపు నిలబడ్డాడు? శ్రీనుని ప్రేమించిన వెన్నెల (అదితి శంకర్)
ఎవరు? అన్నది చిత్ర కథ. ఎలా ఉందంటే.. స్నేహం, విధేయతతో ముడిపడిన కథ ఇది. రెండు కుటుంబాల మధ్య తరాల స్నేహం, ఆలయ భూముల నేపథ్యం ప్రధానంగా సాగుతుంది. బలమైన భావోద్వేగాలు, డ్రామాని
పండించేందుకు ఆస్కారం ఉన్న కథే. కానీ, కీలకమైన ఆ విషయాల్లోనే లోటుపాట్లు కనిపిస్తాయి. ముగ్గురు కథానాయకుల్ని శక్తిమంతమైన పాత్రల్లో ఆవిష్కరిస్తూ, కథలోని డ్రామాతో ఆసక్తిని
రేకెత్తించినప్పటికీ భావోద్వేగాల పరంగా ఆ ప్రభావం కనిపించలేదు. హీరోలకి తగ్గట్టుగా యాక్షన్... కమర్షియల్ హంగుల్లో భాగంగా జోడించిన పాటలు.. బోలెడన్ని పాత్రలు... ఇలా అన్నీ తెరపైన
ఘనంగానే కనిపిస్తాయి. వరుసగా హీరోల పరిచయ సన్నివేశాలతో సినిమాని ఆరంభించిన దర్శకుడు... ప్రేక్షకుడిని అసలు కథలోకి తీసుకెళ్లడానికి కాస్త సమయం తీసుకున్నాడు. ముగ్గురి మధ్య
స్నేహం... శ్రీను, వెన్నెల ప్రేమ నేపథ్యమే ప్రధానంగా ప్రథమార్ధం సాగుతుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఆలయానికి చెందిన నగల నేపథ్యంలో నడిచే డ్రామా
కథని కొత్త మలుపు తిప్పుతుంది. సుదీర్ఘంగా సాగే పోరాట ఘట్టం మరో ఆకర్షణ. ఆ ఎపిసోడ్‌తో కాంతార సినిమాని గుర్తు చేస్తాడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రథమార్ధంతో పోలిస్తే, ద్వితీయార్ధం
సినిమాకి ప్రధాన బలం. డ్రామాకి తోడు, యాక్షన్ హంగులు ఆకట్టుకుంటాయి. మామిడి తోట నేపథ్యంలో సన్నివేశాలు సినిమాకి కీలకం. (Bhairavam Review Telugu) అయితే తెరపైన ఎంత కథ నడుస్తున్నా,
కథనంలో డ్రామా ఉన్నా అది ప్రేక్షకుడి హృదయాన్ని మాత్రం తాకదు. ప్రీ-క్లైమాక్స్‌లో మేనమామగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన బాధ్యతని నిర్వర్తించే సన్నివేశాలు ప్రభావవంతంగా ఉన్నాయి. పతాక
సన్నివేశాలు ఊహకు తగ్గట్టే సాగుతాయి. తమిళంలో విజయవంతమైన ‘గరుడన్’కి రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. కమర్షియల్ హంగుల జోడింపు అంతగా కుదరలేదు. ఎవరెలా చేశారంటే.. బెల్లంకొండ సాయి
శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), మంచు మనోజ్ (Manchu Manoj), నారా రోహిత్ (Nara Rohith) బలమైన పాత్రల్లో కనిపిస్తారు. ముగ్గురి మధ్య సన్నివేశాలు సినిమాకి ప్రధానబలం. తమ నటనతో
పాత్రలకి తగిన ఎంపిక అనిపించారు. విశ్వాసం, విధేయత కలిగిన యువకుడిగా సాయి శ్రీనివాస్ నటన ఆకట్టుకుంటుంది. పోరాట ఘట్టాలతోనూ ఆకట్టుకుంటారు. ఆయనకి అదితీ శంకర్‌కీ మధ్య సాగే ప్రేమ
సన్నివేశాలు, పాటలు కమర్షియల్ హంగుల కోసమే. నిజాయతీ, పెద్దరికం నింపుకొన్న వరద పాత్రలో నారా రోహిత్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తారు. మంచు మనోజ్ రీ ఎంట్రీకి తగ్గ ఓ శక్తిమంతమైన
పాత్ర ఇందులో దొరికింది. ఆయన కొన్ని చోట్ల బిగ్గరగా సంభాషణలు చెప్పినట్టు అనిపించినా, వ్యతిరేక ఛాయలున్న గజపతి వర్మ పాత్రపై తనదైన ముద్ర వేశారు. నారా రోహిత్‌కి జోడీగా నటించిన
దివ్య పిళ్లై, మంచు మనోజ్‌కి జోడీగా నటించిన ఆనంది పాత్రలూ సినిమాలో కీలకమే. వెన్నెల కిశోర్ ఒకట్రెండు సన్నివేశాల్లో కనిపించి నవ్విస్తాడు. అజయ్, శరత్ లోహితాశ్వ, సంపత్ రాజ్, రాజా
రవీంద్ర తదితరులు అలవాటైన పాత్రల్లో కనిపిస్తారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. హరి కె.వేదాంతం విజువల్స్ ఆకట్టుకుంటాయి. (bhairavam director)
దర్శకుడు విజయ్ కనకమేడల పాత పద్ధతుల్లోనే కథ చెప్పారు తప్ప, తన ప్రత్యేకతేమీ చూపించలేదు. నిర్మాణం ఉన్నతంగా ఉంది. * బలాలు * + ముగ్గురు కథానాయకులు * + ద్వితీయార్ధం * +
యాక్షన్ సన్నివేశాలు * బలహీనతలు * - కొరవడిన భావోద్వేగాలు * చివరిగా: భైరవం... ముగ్గురు హీరోల యాక్షన్ హంగామా (Bhairavam Review) * గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి
సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!