
Play all audios:
Canada ఇంటర్నెట్‌డెస్క్: కెనడాలో విద్యాభ్యాసం చేయాలనుకొనే స్టూడెంట్స్‌కు ఇప్పుడు భారీగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ దేశం భారతీయ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్లలో దాదాపు 31శాతం కోత
విధించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన ఇమిగ్రేషన్, రెఫ్యూజీ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) రికార్డులు వెల్లడిస్తున్నాయి. 2025 తొలి త్రైమాసికంలో కేవలం 30,640
పర్మిట్లు మాత్రమే జారీ చేశారు. గతంతో పోల్చుకొంటే ఇది 31శాతం తక్కువ. 2024 ఇదే సీజన్‌లో దాదాపు 44,295 మంజూరు చేశారు. కెనడాలో 2023 నుంచి అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలన్న
నిర్ణయానికి అనుగుణంగా తీసుకొంటున్న చర్యల ఫలితంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. ఆ ఏడాది కెనడా మొత్తం 6,81,155 స్టడీ పర్మిట్లను జారీ చేసింది. దీనిలో భారతీయులకే 2,78,045 దక్కాయి. ఇక ఈ సంఖ్య 2024లో
5,16,275గా ఉంది. వీటిల్లో ఇండియన్స్‌కు 1,88,465 లభించాయి. భారీ స్థాయిలో వలసలు ఉండటంతో కెనడా ప్రభుత్వం విద్యార్థులకు పర్మిట్ల విషయంలో నియంత్రణ విధించాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఆ దేశంలో
గృహాల లభ్యత గణనీయంగా తగ్గడం కూడా దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. దీంతోపాటు రవాణ, ఆరోగ్య, ఇతర మౌలిక వసతులపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతోందని ప్రభుత్వం భావించింది. తాజాగా ఈ అంశంపై ఆ దేశ
ప్రధాని మార్క్ కార్నీ మాట్లాడుతూ 2028 నాటికి దేశ జనాభాలో విద్యార్థులు, విదేశీ పనివారి సంఖ్య 5 శాతానికి మించకుండా చూడాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిని సాధించేందుకు ఐఆర్‌సీసీ విద్యార్థి
పర్మిట్లను 2025కు 4,37,000 నిర్ణయించింది. తొలుత దీనిని 4,85,000 అనుకొన్నారు. 2026 నుంచి ఈ సంఖ్యను స్థిరీకరించనున్నారు. స్టడీ పర్మిట్లు పొందాలనుకొనేవారు పాటించాల్సిన నిబంధనలు కూడా
ప్రకటించారు. 2024 జనవరి 1 నుంచి వారి వద్ద 20,635 కెనడా డాలర్ల (రూ.12.7లక్షలు) నిధులు ఉన్నట్లు నిరూపించాలి. గతంలో ఈ మొత్తం 10వేల కెనడా డాలర్లు (రూ.6.14లక్షలు)గా ఉండేది. ఐఆర్‌సీసీ నుంచి
తీసుకొన్న అనుమతి పత్రాన్ని సంబంధిత విద్యార్థి నుంచి డిజిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ తీసుకోవాలి.