
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: యావత్ ప్రపంచాన్ని కకావికలం చేసిన కరోనా మహమ్మారి (Coronavirus).. కొన్ని దేశాల్లో మళ్లీ ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయ్‌లాండ్‌తో పాటు చైనాలోనూ
కొవిడ్-19 వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. భారత్‌లోనూ కొన్ని కేసులు నమోదవుతున్నప్పటికీ.. తీవ్రత తక్కువేనని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. అయినా
అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. వేల సంఖ్యలో కేసులు.. సింగపూర్ ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం ఏప్రిల్ చివరి వారంలో 14వేల కరోనా (Covid 19) కేసులు వెలుగుచూశాయి.
అంతకుముందు వారం కూడా దాదాపు 11వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిత్యం 100 మంది బాధితులు ఆసుపత్రుల్లో చేరుతుండగా.. ఐసీయూలో చేరికలు మాత్రం అతి స్వల్పంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
థాయ్‌లాండ్‌లోనూ వారానికి వేల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. మే రెండో వారంలోనే 33వేల కేసులు రికార్డయినట్లు అంచనా. ఒమిక్రాన్ తరగతికి చెందిన ఎక్స్‌ఈసీ వేరియంట్ వల్లే కేసుల సంఖ్య
పెరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అటు హాంకాంగ్‌లోనూ కొవిడ్ వ్యాప్తి విపరీతంగా పెరిగింది. * అధికారులూ.. దుబారా వద్దు.. మద్యం, సిగరెట్ కట్: చైనా చైనాలో కూడా కొవిడ్ పాజిటివ్
కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఫ్లూ తరహా లక్షణాలతో గత ఐదు వారాలుగా ఆసుపత్రులకు వెళ్తున్న వారి సంఖ్య సాధారణంతో పోలిస్తే రెట్టింపు అయినట్లు తెలిపింది.
కేసుల పాజిటివిటీ రేటు 7.8శాతం నుంచి 16శాతానికి పెరగగా.. ఆసుపత్రి చేరికలు 3శాతం నుంచి 6శాతానికి పెరిగినట్లు సమాచారం. పెరుగుదలకు కారణమేంటి..? ఆసియా దేశాల్లో ప్రస్తుతం వైరస్ వ్యాప్తికి
జేఎన్.1 వేరియంట్, దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు. జేఎన్.1 ఉపరకాలైన ఎల్‌ఎఫ్.7, ఎన్‌బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని సింగపూర్ ఆరోగ్యశాఖ తెలిపింది. స్థానికంగా
సీక్వెన్స్ చేసిన కేసుల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ కేసులు ఇవేనని పేర్కొంది. ప్రస్తుత కొవిడ్-19 వ్యాక్సిన్‌లో జేఎన్.1 వేరియంట్‌ను ఉపయోగించినట్లు వెల్లడించింది. సీజనల్ వాతావరణ
పరిస్థితులు, సామూహిక కార్యక్రమాలు, ప్రయాణాలు పెరగడం కేసుల పెరుగుదలకు కారణంగా సింగపూర్ ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రజల్లో రోగనిరోధక శక్తి క్షీణించడం కూడా ఇందుకు కారణమని చెప్పింది. కరోనా వైరస్
స్థానిక వ్యాధిగా పరిణామం చెందిందని హాంకాంగ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ వేరియంట్లలో కలిగే మార్పులు ప్రస్తుత వ్యాప్తికి సంబంధం ఉందని, దీంతోపాటు హెర్డ్ ఇమ్యూనిటీ తగ్గడం కూడా మరో కారణంగా
పేర్కొంది. అయితే, ప్రస్తుతం ఆసియా దేశాల్లో కొవిడ్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్న జేఎన్.1 రకం ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ మాత్రమేనని, ఆందోళన కలిగించే రకం (Variant of Concern) కాదని ప్రపంచ
ఆరోగ్య సంస్థ ఇదివరకే స్పష్టం చేసింది.