
Play all audios:
Protean eGov shares | ముంబయి: ఈ-గవర్నెన్స్ సేవలు అందించే ప్రొటీన్ ఈగవ్ టెక్నాలజీ (Protean eGov shares) షేర్లు భారీగా పతనం అయ్యాయి. రెండు ట్రేడింగ్ సెషన్లలో ఈ స్టాక్ విలువ దాదాపు 30 శాతం
మేర క్షీణించింది. సోమవారం ట్రేడింగ్ 20 శాతం మేర పతనం కాగా.. నేటి ట్రేడింగ్ ఆరంభంలో 13 శాతం మేర నష్టాన్ని చవిచూసి తర్వాత కోలుకుంది. మధ్యాహ్నం 1.15 గంటల సమయానికి 8.76 శాతం నష్టంతో 1,043.00
వద్ద కొనసాగుతోంది. కీలకమైన పాన్ 2.0 ప్రాజెక్టుకు ప్రొటీన్ ఈగవ్ అర్హత సాధించకపోవడమే షేర్లు పతనానికి కారణం. పాన్‌కు కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం పాన్ 2.0 ప్రాజెక్టును చేపట్టిన సంగతి
తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్, డెవలప్‌మెంట్, ఆపరేషన్స్, మెయింటెయినెన్స్ కోసం ఆదాయపు పన్ను శాఖ బిడ్డింగ్‌లు ఆహ్వానించగా.. ప్రాజెక్టును చేజిక్కించుకోవడంలో
ప్రొటీన్ ఈగవ్ విఫలమైంది. మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరించేందుకు బిడ్డింగ్‌లో పాల్గొనగా.. తదుపరి రౌండ్‌కు అర్హత సాధించలేదంటూ ఐటీ విభాగం నుంచి తమకు కమ్యూనికేషన్ అందినట్లు ఆదివారం
ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో ప్రొటీన్ ఈగవ్ తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న పాన్ ప్రక్రియపై పెద్దగా ప్రభావం ఉండబోదంటూ ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ వ్యాఖ్యలేవీ మార్కెట్‌ను
మెప్పించకపోవడంతో రెండు రోజులుగా వరుసగా పతనం అవుతున్నాయి. ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా
బ్యాంక్‌కు పరిమిత సంఖ్యలో ఈ సంస్థలో వాటాలు ఉన్నాయి. ప్రస్తుత స్థితిలో ఈ స్టాక్‌కు కొందరు ‘బై’ రేటింగ్ ఇస్తుండగా.. మరికొందరు ‘సెల్’ రేటింగ్ ఇస్తున్నారు.