
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ఇల్లు కొనుగోలు చేయాలంటే లక్షల్లో, కోట్లలో ఖర్చువుతుంది. అంత డబ్బు ఒకేసారి పెట్టుబడి పెట్టాలంటే చాలా మందికి సాధ్యంకాదు. అలాంటి వారు సొంతింటి కలను నెరెవేర్చుకోవడంలో గృహ
రుణాలు సహాయపడుతున్నాయి. ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా నెల నెలా ఈఎంఐలు చెల్లించి ఇంటిని సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు గృహరుణం అసలు, వడ్డీ చెల్లింపులపై ఆదాయపు పన్ను ప్రయోజనాలను
పొందవచ్చు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. గృహ రుణం అనేది 20 నుంచి 30 సంవత్సరాలు పాటు కొనసాగే దీర్ఘకాల రుణం. ఈ కాలంలో రుణం తీసుకున్న వ్యక్తికి అనుకోనిదేదైనా జరిగితే.. ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత
కుటుంబ సభ్యులపై పడుతుంది. సంపాదన లేని ఆధారిత కుటుంబ సభ్యులు అప్పు చెల్లించలేక.. ఇంటిని వదులుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు. ఇలాంటి పరిస్థితులు రాకుండా రుణం తీసుకున్న సమయంలోనే గృహ రుణ బీమా
లేదా టర్మ్ పాలసీని తీసుకోవడం ద్వారా రక్షణ కల్పించవచ్చు. మరి ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలనే సందేహం ఉంటుంది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. టర్మ్ బీమా.. బీమా కాలవ్యవధిలో పాలసీ తీసుకున్న
వ్యక్తి అనుకోకుండా మరణిస్తే, బీమా హామీ మొత్తం ఆధారిత కుటుంబ సభ్యుల చేతికి అందుతుంది. దీంతో వారు రుణాలు (గృహ రుణంతో పాటు, ఇతర రుణాలు) చెల్లించవచ్చు. అలాగే, భవిష్యత్తు కోసం ఉపయోగించుకోవచ్చు.
ఒకవేళ టర్మ్ పాలసీ కాలపరిమితి ముగిసే వరకు బీమా చేసిన వ్యక్తి జీవించి ఉంటే ఎలాంటి హామీ మొత్తం అందదు. గృహ రుణ బీమా.. రుణం తీసుకుని ఇంటిని కొనుగోలు చేసినప్పుడు గృహ రుణ బీమాను తీసుకోవచ్చు. ఇది
మీ లోన్ మొత్తం, కాలపరిమితికి అనుగుణంగా ఉంటుంది. అంటే గృహ రుణ కాలపరిమితిలో బీమా చేసిన వ్యక్తి మరణిస్తే హామీ మొత్తాన్ని, బీమా సంస్థ బ్యాంకుకు చెల్లిస్తుంది. దీంతో రుణం తీర్చాల్సిన బాధ్యత
కుటుంబ సభ్యులపై ఉండదు. గృహ రుణ బీమాలో సాధారణంగా చెల్లించాల్సిన రుణాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం బీమా హామీ మొత్తం తగ్గుతూ వస్తుంది. ఉదాహరణకు రూ. 1 కోటి గృహ రుణం, 30 ఏళ్ల కాలపరిమితితో
తీసుకుని 10 సంవత్సరాలు ఈఎంఐ చెల్లించిన తర్వాత ఆ వ్యక్తి మరణిస్తే రూ.1 కోటి హామీ మొత్తం రాదు. బకాయి ఉన్న మొత్తం వరకు మాత్రమే అందుతుంది. అంటే కాలవ్యవధి ముగిసే సమయానికి హామీ మొత్తం సున్నా
అవుతుంది. అయితే కొన్ని గృహ రుణ పాలసీలు.. రుణం చివరి వరకు ఒకటే హామీ మొత్తాన్ని అందిస్తున్నాయి. వీటికి ప్రీమియం కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఏది ఎంచుకోవాలి? గృహ రుణం, టర్మ్ ఇన్సురెన్స్ మధ్య
నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా మీ బాధ్యతలను తెలుసుకోవాలి. టర్మ్ ప్లాన్ అనేది స్థిర మరణ ప్రయోజనాన్ని అందిస్తుంది. దీన్ని దేనికైనా ఉపయోగించుకోవచ్చు. కానీ గృహ రుణం బకాయి ఉన్న లోన్‌ను
మాత్రమే కవర్ చేస్తుంది. ఇప్పటికే టర్మ్ పాలసీ ఉంటే..? తగినంత హామీ మొత్తంతో గృహ రుణం తీసుకునే సమయానికే మీకు టర్మ్ ప్లాన్ ఉంటే.. గృహ రుణంతో పాటు గృహ రుణ బీమా తీసుకోవచ్చు. గృహ రుణ బీమా
ప్రీమియం ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని బ్యాంకులు గృహ రుణంతో పాటు కలిపి ఇస్తాయి. తదనుగుణంగా ప్రీమియం నిర్ణయిస్తాయి. అలా కాకుండా, విడిగా కూడా గృహ రుణ బీమా తీసుకోవచ్చు. టర్మ్
పాలసీ లేకపోతే..? ఒకవేళ మీకు ఇప్పటి వరకు టర్మ్ పాలసీ లేకపోతే..మీ బాధ్యతలను తీర్చగలిగే హామీ మొత్తంతో టర్మ్ ప్లాన్ తీసుకోవడం మంచిది. టర్మ్ ప్లాన్ ప్రీమియం ఏటా చెల్లించాల్సి ఉంటుంది. టర్మ్
ప్లాన్‌లో తక్కువ ప్రీమియంతో ఎక్కువ హామీని పొందవచ్చు. అలాగే ఈ మొత్తాన్ని కుటుంబ సభ్యులు ఏ అవసరానికైనా వినియోగించుకోవచ్చు. ప్రీమియం పోల్చి చూడండి.. మీ గృహ రుణానికి సమానమైన హామీ మొత్తానికి,
గృహ రుణ బీమా, టర్మ్‌ప్లాన్లకు ఎంత ప్రీమియం చెల్లించాలో పోల్చి చూడండి. ఇందులో మీకు ఏది అనుకూలంగా ఉంటే దాన్ని ఎంచుకోవచ్చు. ఈ రెండింటిలో టర్మ్ ప్లాన్ తక్కువగా ఉంటే.. ప్రీమియం కూడా ఒకేసారి
చెల్లించాల్సిన అవసరం ఉండదు. టర్మ్ ప్లాన్ ఎంచుకోవచ్చు.